KTR: నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉంది.. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి: కేటీఆర్
- నిజాం కాలేజీలో బోయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్ లకు కేటీఆర్ శంకుస్థాపన
- హాజరైన సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ
- నిజాం కాలేజీలో చదువుకున్నానని గొప్పగా చెపుతానన్న కేటీఆర్
హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ లో తాను చదువుకున్నానని, ఈ కాలేజ్ లో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజాం కాలేజీకి ఎంతో గొప్ప పేరు ఉందని, విదేశాలకు వెళ్లినప్పుడు తాను నిజాం కాలేజీలో చదువుకున్నానని గొప్పగా చెపుతానని వెల్లడించారు. నిజాం కాలేజీలో బోయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్ కు కేటీఆర్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇదే కాలేజీలో తాను చదువుకున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలేజీలకు అనేక నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు.
గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా నిజాం కాలేజీలోనే చదువుకున్నారని, కానీ కాలేజీ కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. విద్యా శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించారని చెప్పారు. యూనివర్శిటీల అభివృద్ధికి రూ. 500 కోట్లు కేటాయించారని తెలిపారు. గురుకులాలను ఏర్పాటు చేసిన తర్వాత చదుకునే అమ్మాయిల సంఖ్య చాలా పెరిగిందని చెప్పారు. కల్యాణ లక్ష్మి పథకం కింద వచ్చిన డబ్బును ఉన్నత చదువుల కోసం కొందరు అమ్మాయిలు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.