Team India: అమెరికా గడ్డపై భారత జట్టు అదరగొడుతుందా?
- నేడు విండీస్‌తో టీమిండియా నాలుగో టీ20
- సిరీస్ సమంపై హార్దిక్ సేన గురి
- మ్యాచ్‌కు వాన ముప్పు
మూడో మ్యాచ్ లో ఘన విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో రేసులోకి వచ్చిన టీమిండియా.. అగ్రరాజ్యం అమెరికా గడ్డపై వెస్టిండీస్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. ఈరోజు జరిగే నాలుగో టీ20లో గెలిచి 2–2తో సిరీస్‌ను సమం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. వరుస వైఫల్యాల తర్వాత గత పోరులో సూర్య కుమార్ ఎట్టకేలకు ఫామ్ అందుకోగా, తిలక్ వర్మ సత్తా చాటుతున్నాడు. బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. కానీ ఓపెనింగ్ కాంబినేషన్ ఫ్లాప్ అవుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ నిరాశ పరిచారు. గత పోరులో ఓపెనర్‌గా వచ్చిన అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ తొలి వికెట్‌కు భారత ఓపెనర్లు 6, 16,5 పరుగులు మాత్రమే జోడించారు.
ఓపెనర్లిద్దరూ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతున్న టీమిండియా ఒత్తిడిలో పడిపోతోంది. ఈసారైనా ఓపెనర్లు జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలి. ముఖ్యంగా మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్లకే ఔటైన శుభ్‌మన్ గిల్ తన స్థాయికి తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఏడాది తర్వాత అమెరికాలోని లాడర్‌హిల్‌లో ఆడబోతున్న టీమిండియా అక్కడ సిరీస్ గెలుస్తుందేమో చూడాలి. మరోవైపు 2–1తో ఆధిక్యంలో ఉన్న వెస్టిండీస్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. పూరన్, పావెల్ ఫామ్‌లో ఉండగా.. హెట్మయర్ కూడా ఫామ్ అందుకుంటే ఆ జట్టు బలం మరింత పెరగనుంది. అయితే, మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. ఈ రోజు వర్షం పడే అవకాశం 47 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.