Chandrababu: తిరుమలలో చిన్నారి మృతిపై చంద్రబాబు స్పందన
- చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి అత్యంత విషాదకరమన్న చంద్రబాబు
- కొన్ని రోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డాడని వెల్లడి
- అప్పుడే టీటీడీ రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఘోరం తప్పేదని వ్యాఖ్య
- తగిన రక్షణ చర్యలతో భక్తుల భయాన్ని తొలగించాలని సూచన
తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి అత్యంత విషాదకరమని అన్నారు. పాప తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్లముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా” అని పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడే టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేదని అన్నారు. అధికారులు సమర్థ ప్రణాళికతో వ్యవహరించాలని, తగిన రక్షణ చర్యలతో భక్తుల భయాన్ని తొలగించాలని సూచించారు.