Komatireddy Raj Gopal Reddy: భూములు అమ్ముతూ రాష్ట్రాన్ని నడుపుతోంది తెలంగాణ మాత్రమే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- భారీగా అప్పులు చేస్తున్నారని కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం
- ఇలాగే కొనసాగితే తెలంగాణ మరో శ్రీలంక అవుతుందని హెచ్చరిక
- ఇటీవల కోకాపేట, బుద్వేలు భూముల అమ్మకం నేపథ్యంలో ట్వీట్
భారీగా అప్పులు చేస్తూ, ప్రభుత్వ భూములను అమ్ముతూ దేశంలో ఓ రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇలాగే ఉంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరో శ్రీలంక కావడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోకాపేట, బుద్వేల్‌లో భూములను విక్రయించిన విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కోకాపేటలో ఎకరం భూమి రూ.100 కోట్లు కూడా దాటిన విషయం తెలిసిందే. బుద్వేలులోనూ ఎకరం భూమి కోట్లు పలికింది. ప్రభుత్వం అంచనాల కంటే అధిక ఆదాయం వచ్చింది. అయితే ప్రభుత్వ భూముల విక్రయాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రభుత్వ భూములు విక్రయించవద్దని చెప్పిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తున్నాయి.