Eiffel Tower: ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కు బాంబు బెదిరింపు
- నిత్యం వేలాది మంది సందర్శించే పర్యాటక స్థలం ఈఫిల్ టవర్
- ఫ్రాన్స్ కే వన్నె తెచ్చే చారిత్రాత్మక కట్టడం
- బాంబు బెదిరింపు నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు
- ఈఫిల్ టవర్ నుంచి పర్యాటకులను ఖాళీ చేయించిన వైనం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో కొలువై ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కు బాంబు బెదిరింపు వచ్చింది. నిత్యం వేలాది మంది సందర్శించే ఈఫిల్ టవర్ ను బాంబు బెదిరింపు నేపథ్యంలో భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇందులోని మూడు ఫ్లోర్ల నుంచి పర్యాటకులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. కింది భాగంలో ఉన్న సందర్శన స్థలం నుంచి కూడా పర్యాటకులను బయటికి పంపించి వేశారు.
ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ ఎస్ఈటీఈ (SETE) దీనిపై స్పందించింది. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించామని ఎస్ఈటీఈ అధికార ప్రతినిధి తెలిపారు. పోలీసులు, బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టినట్టు, అక్కడున్న ఓ రెస్టారెంటులోనూ సోదాలు నిర్వహించినట్టు వివరించారు. ఏదేమైనా, ఇదొక అరుదైన పరిస్థితి అని పేర్కొన్నారు. కాగా, ఈఫిల్ టవర్ వద్ద బాంబు ఉన్నదీ, లేనిదీ ఇంకా నిర్ధారణ కాలేదు.