New Delhi: స్వాతంత్ర్య దినోత్సవం.. ఢిల్లీలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
- నగరంలో పలు చోట్ల చెక్‌పోస్టుల ఏర్పాటు, విసృతస్థాయిలో వాహనాల తనిఖీలు,
- ఎర్ర కోట వద్ద త్రివిధ దళాలు సైనిక విన్యాసాల ప్రాక్టీసు
- హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలని దేశ ప్రజలకు మోదీ పిలుపు
మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసు వాహనాలు పలు ప్రాంతాల్లో గస్తీ తిప్పుతున్నారు. మరోవైపు, భారత త్రివిధ దళాల బృందాలు ఎర్రకోట వద్ద వివిధ సైనిక విన్యాసాలను ప్రాక్టీసు చేశాయి.
భారత్ స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం దేశప్రజలకు ముఖ్య సూచన చేశారు. ఆగస్టు 13 నుంచి 15 వరకూ దేశప్రజలందరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు. భారత స్వాతంత్ర్య స్ఫూర్తికి, జాతి ఐక్యతను చిహ్నమైన మువ్వన్నెల జెండాతో తాము దిగిన ఫొటోలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. త్రివర్ణ పతాకంతో భారత్‌కు ఓ భావోద్వేగపూరిత బంధం ఉందన్న ప్రధాని, దేశప్రగతి కోసం మరింత శ్రమించేలా త్రివర్ణ పతాకం మనలో స్ఫూర్తి నింపుతోందని చెప్పారు.
కాగా, ఢిల్లీలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సెంట్రల్ విస్టా ప్రాజక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరికీ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ప్రగతి పథాన నడుస్తున్న గ్రామాల సర్పంచ్‌లు, టీచర్లు, నర్సులు, రైతులు, ఖాదీ రంగంలోని కార్మికులు, జాతీయ అవార్డు గ్రహీతలైన పాఠశాల ఉపాధ్యాయులు, బీఆర్ఓ సిబ్బంది, అమృత్ సరోవర్ ప్రాజెక్టు, హర్ ఘర్ జల్ ప్రాజుక్టులో పనిచేసిన వారు ఈ వేడుకల్లో పాలుపంచుకుంటారు. ఈ మేరకు వారందరికీ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆహ్వానాలు పంపింది.