India: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించిన భారత్
- ఫైనల్లో మలేసియాపై ఉత్కంఠ విజయం
- నాలుగోసారి ట్రోఫీ నెగ్గిన టీమిండియా
- టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డు
చెన్నై వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత్ విజేతగా నిలిచింది. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆతిథ్య జట్టు 4–3తో మలేషియాపై ఉత్కంఠ విజయం సాధించింది. ఫైనల్లో ఓ దశలో 1–3తో వెనుకబడినా గొప్పగా పుంజుకొని మలేషియా పని పట్టింది. దాంతో టోర్నీలో రికార్డు స్థాయిలో నాలుగోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకుంది. ఏడు ఎడిషన్లలో అత్యధికంగా నాలుగోసారి విజేతగా నిలిచిన భారత్ మూడు ట్రోఫీలతో ఉన్న పాకిస్థాన్ ను వెనక్కునెట్టి టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ తరఫున జుగ్‌రాజ్ సింగ్ (9 వ నిమిషం), హర్మన్ ప్రీత్ సింగ్ (45వ ని.), గుజ్రాంత్ సింగ్ (45వ ని.), ఆకాశ్ దీప్ సింగ్ (56వ ని.) తలో గోల్‌తో ఆతిథ్య జట్టును గెలిపించారు. మలేసియా తరఫున అజ్రాయి అబు కమల్ (14వ ని.), రహీమ్ రెజీ (18వ ని.), ముహమద్ అమినుద్దీన్ (28వ ని.) తలో గోల్ చేశారు. మూడో స్థానం కోసం జరిగిన మరో మ్యాచ్ లో జపాన్ 5–3తో సౌత్ కొరియాను ఓడించింది. కాగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 5 లక్షలను నజరానాగా అందిస్తున్నట్టు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.