Team India: భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు
- రాబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ లో పోటీ పడనున్న దాయాది దేశాలు
- ఇండో–పాక్ మ్యాచ్‌లో వంద శాతం ప్రదర్శన చేయాలని ఆటగాళ్లు కోరుకుంటారన్న జడేజా
- ఎంత కృషి చేసినా ఒక్కోసారి అనుకున్న ఫలితం రాదన్న స్టార్ ఆల్ రౌండర్
భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఇరు దేశాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. మ్యాచ్ కు నెలల ముందు నుంచే ఆసక్తి పెరుగుతోంది. వచ్చే నెలలో ఆసియా కప్‌తో రెండుసార్లు, అక్టోబర్–నవంబర్‌లో భారత్ ఆతిథ్యం ఇచ్చే వన్డే ప్రపంచ కప్ లో ఓసారి ఇరు జట్లూ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండో–పాక్ పోటీ గురించి టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఏ టోర్నీలో అయినా పాక్‌తో మ్యాచ్ అనగానే అంచనాలు భారీగా ఉంటాయన్నాడు. ఈ మ్యాచ్ లో తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆటగాళ్లు కోరుకుంటారని చెప్పాడు.
‘భారత్– పాక్ మ్యాచ్ ఉందంటే మన జట్టుపై గెలవాలని చాలా అంచనాలు ఉంటాయి. కానీ మా వరకు భారత్ ఆడే ఏ మ్యాచ్ అయినా దాయాది దేశాల మ్యాచ్‌కు సమానమైన ప్రాముఖ్యతే ఉంటుంది. అయితే, ఇండో-పాక్ మ్యాచ్ సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆటగాళ్లుగా మేం కూడా ఈ మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని చూస్తుంటాం. ప్రతీ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్లు తమ వంద శాతం ప్రదర్శన ఇస్తారు. కానీ, ఒక్కోసారి మనం ఆశించిన ఫలితం రాదు. దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు కూడా. ఎందుకంటే ఇది ఒక ఆట. రెండు జట్ల ఆటగాళ్లు వారి దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తారు. ఇరువురూ గెలవాలనే ఆడతారు. ఆటపైనే దృష్టి కేంద్రీకరించి, మైదానంలో శాయశక్తులా కృషి చేస్తారు. అయినప్పటికీ ఫలితంపై ఎవ్వరం హామీ ఇవ్వలేం. ఇక్కడ ఫలితం కంటే విజయం కోసం శక్తిమేరకు కృషి చేయడమే ముఖ్యం’ అని జడేజా చెప్పుకొచ్చాడు.