Chandrababu: వైజాగ్ లో ఆగస్ట్ 15న ఇండియా విజన్ -2047 డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు
- చంద్రబాబు చైర్మన్ గా ఉన్న GFST
- కొన్ని నెలలుగా విజన్ డాక్యుమెంట్ పై కృషి
- తుదిమెరుగులు దిద్దుకుంటున్న విజన్ డాక్యుమెంట్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చైర్మన్ గా వ్యవహరిస్తున్న గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (GFST) సంస్థ గత కొన్నినెలలుగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై కృషి చేస్తోంది. 5 stretagies for India as global leader పేరుతో ఈ విజన్ డాక్యుమెంట్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు.
ఈ ఇండియా విజన్-2047 డాక్యుమెంట్ ను చంద్రబాబు ఆగస్టు 15న విశాఖలో జరిగే ఓ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, పలు రంగాల నిపుణులు పాల్గొననున్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ పై GFST అన్ని వర్గాల నుంచి సూచనలు స్వీకరించనుంది.
GFST గురించి వివరాలు...
గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఈ సంస్థ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా పనిచేస్తోంది. ఇది మూడేళ్ల క్రితం ఏర్పాటైంది. ఈ సంస్థకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా ఉన్నారు.
దీనిలో ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు.
పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు GFST వేదికగా పనిచేస్తోంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమలు, MSME పరిశ్రమలు, టెక్నాలజీ, ఎనర్జీ, స్టార్ట్-అప్ ఎకో సిస్టమ్, వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై GFST కృషి చేస్తోంది.
భారతదేశం 2047 నాటికి స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి భారత్ ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై GFST పనిచేస్తుంది.
ఆయా రంగాల నిపుణులు, విద్యావేత్తలు, సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో GFST నివేదికలు సిద్దం చేస్తుంది. ఈ కార్యాచరణలో భాగంగానే చంద్రబాబు ఆగస్ట్ 15వ తేదీన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయనున్నారు.