Independence Day: ప్రధానికి పచ్చడి పంపిన మహిళకు స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనేందుకు ఆహ్వానం
- ఈమారు స్వాతంత్ర్య దినోత్సవంలో సామాన్యులూ పాల్గొనేందుకు అవకాశం
- ప్రధాని లక్ష్యానికి అనుగూణంగా ‘జన్ భాగియదారీ’ కార్యక్రమం
- ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రత్యేక అహ్వానాలు
- ప్రధానికి ఆపిల్ పచ్చడి పంపిన మహిళకు దక్కిన అపూర్వ అవకాశం
రేపు ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నారు. ఇక ఢిల్లీ వేదికగా జరిగే వేడుకలకు భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే, ప్రచారానికి దూరంగా దేశ అభ్యున్నతికి పాటుపడే సామాన్యులకు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈసారి అవకాశమివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ దిశగా ప్రారంభమైన ‘జన్ భాగియదారి’ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1800 మంది సామాన్య పౌరులు ప్రత్యేక అతిథులుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
అయితే, ప్రధానికి ఆపిల్ పళ్ల పచ్చడిని పంపించిన ఓ ఉత్తరాఖండ్ మహిళ కూడా ఈ వేడుకల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఉత్తరకాశీ జిల్లాకు చెందిన సునీత రౌతేలా తన భర్త భరత్ సింగ్ రౌతేలాతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంటారు. భరత్ సింగ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీఓ) లబ్ధిదారు. ఇటీవల ఈ సంస్థ తయారు చేసిన ఆపిల్ పళ్ల చట్నీని భరత్ సింగ్ భార్య ప్రధానికి పంపించారు. ఆ తరువాత కొద్ది రోజులకు, భారత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలంటూ ఎఫ్పీఓకు ప్రధాని కార్యాలయం నుంచి లేఖ అందింది. ఈ లేఖలో యాపిల్ చట్నీ ప్రస్తావన కూడా ఉండటంతో భరత్ సింగ్ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. తన భార్యతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. సునీత రౌతేలా తన గ్రామానికి చెందిన 162 మంది రైతులను ఏకంచేసి ఈ ఎఫ్పీఓను ఏర్పాటు చేశారు.