Narendra Modi: స్వాతంత్ర్య దినోత్సవం.. జాతిని ఉద్దేశించి ప్రధాని చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
- స్వాతంత్ర్య దినోత్సవం కోసం ఎర్రకోట వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి
- ఢిల్లీలో పది వేల మంది సిబ్బందితో పటిష్ఠంగా భద్రతా ఏర్పాట్లు
- వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ
యావత్ దేశ ప్రజల మనసులు గర్వంతో ఉప్పొంగే రోజు రానే వచ్చింది. మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవం కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం 7.30 గంటలకు రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధానికి ఇది వరుసగా పదవ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇది ప్రధానికి చివరి ప్రసంగం. దీంతో, జాతిని ఉద్దేశించి మోదీ ఏం చెబుతారా అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.
2014 నుంచి ప్రధాని తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రభుత్వ విధానాల గురించి విశదీకరించారు. అయితే, ప్రతిపక్షాలను నేరుగా విమర్శించలేదు. ప్రభుత్వ విధానాలతో వచ్చిన గుణాత్మక మార్పులను మాత్రమే ఆయన ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక అవినీతి, విధానపరమైన స్తబ్దత తొలగిపోయాయని చెప్పేవారు.
ప్రపంచయవనికపై పెరుగుతున్న భారత దేశ ప్రాముఖ్యాన్ని మోదీ గతంలో పలుమార్లు ప్రస్తావించారు. 2014నాటి తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్వచ్ఛ భారత్, జన్ ధన్ అకౌంట్ల వంటి పథకాలను ప్రవేశపెట్టారు. భారత్‌ను 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తన పంచ ప్రాణ ప్రణాళికను మోదీ గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశ ప్రజల ముందుంచారు. అంతేకాకుండా, అనేక ప్రతిష్ఠాత్మక పథకాలను పరిచయం చేశారు. దీంతో, ఈసారి ప్రధాని ఏం చెప్పనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు, ఎర్రకోట వేదికగా జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఢిల్లీలో 10 వేల పైచిలుకు మంది సిబ్బందిని మోహరించి పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాల్లో సుమారు వెయ్యి నిఘా కెమెరాలు, విడియో విశ్లేషణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.