Vishwakarma Yojana: స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని గిఫ్ట్.. సంప్రదాయ కార్మికులకు ‘విశ్వకర్మ యోజన’ పథకం ప్రకటన
- విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 17న ప్రకటన
- స్వర్ణకారులు, కమ్మరులు, రజకులు, క్షురకులు, తాపీ మేస్త్రీల కోసం ‘విశ్వకర్మ యోజన’
- ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్ల కేటాయింపు
- వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం అగ్రగామిగా నిలుస్తుందన్న మోదీ
స్వాతంత్య్ర దినోత్సవాన సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభవార్త చెప్పారు. ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఎర్రకోటపై జాతినుద్దేశించి మాట్లాడుతూ.. స్వర్ణకారులు, కమ్మరులు, రజకులు, క్షురకులు, తాపీమేస్తీల కోసం వచ్చే మరికొన్ని నెలలలో విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వీరిలో చాలావరకు ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారని తెలిపారు.
సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామన్న ప్రధాని మోదీ.. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. వచ్చే స్వాతంత్ర్య దినోత్సవాన దేశం సాధించిన విజయాలను ఎర్రకోట నుంచి వివరిస్తానని చెప్పారు.