Revanth Reddy: ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు: మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి
- ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం ఉందన్న టీపీసీసీ చీఫ్
- ఎస్సీ వర్గీకరణ ఎవరి పేటెంట్ కాదని వ్యాఖ్య
- దామాషా పద్ధతి ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తెలుసునన్న రేవంత్
- ఎన్నికల కోసమే కేసీఆర్ రైతు రుణమాఫీ అని ఆరోపణ
ఎన్నికల కోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ నాలుగేళ్లలో రైతులపై పడ్డ వడ్డీని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఆ లెక్కన ఇప్పుడు చేస్తోన్న రుణమాఫీ సరిపోదన్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తోంది రుణమాఫీనా? వడ్డీ మాఫీనా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని చెబుతున్నాడన్నారు. అయితే, కేసీఆర్ ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు భూముల విక్రయానికి తెరలేపిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని సమీక్షిస్తామన్నారు.
అలాగే, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణ ఎవరి పేటెంట్ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని, తమ కమిట్మెంట్కు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. దామాషా పద్ధతి ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసునని చెప్పారు. ఎవరి వకాల్తాలు అవసరం లేదని, అలాగే ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.