Thota Chandrasekhar: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుంది: తోట చంద్రశేఖర్
- తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్న తోట చంద్రశేఖర్
- ఏపీ ప్రజలకు కనీసం రాజధాని కూడా లేదని విమర్శ
- కులం, మతం ప్రాతిపదికన ఏపీలో పాలన జరుగుతోందని మండిపాటు
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. కులం, మతం ప్రాతిపదికన ఏపీలో పాలన జరుగుతోందని విమర్శించారు. ఏపీ ప్రజలకు కనీసం రాజధాని కూడా లేకపోవడం దారుణమని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంటే... ఏపీ మాత్రం వెనుకబడి ఉందని అన్నారు.
తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చంద్రశేఖర్ తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ అగ్ర స్థానంలో ఉందని చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణలో 2 కోట్ల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చారని తెలిపారు. ఏపీలోని యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వెళ్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చే సత్తా ఈ నాయకులకు లేదని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నప్పటికీ ఇక్కడి నాయకులు ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ మాదిరి ఏపీ కూడా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని అన్నారు.