China: ప్రమాదకర ఆయుధాన్ని అభివృద్ధి చేసిన చైనా... నేరుగా ఉపగ్రహాలే టార్గెట్!
- లేజర్ అస్త్రాన్ని రూపొందించిన చైనా
- కొత్త అస్త్రం కోసం వినూత్న రీతిలో కూలింగ్ టెక్నాలజీ
- వేడెక్కకుండానే అత్యంత శక్తిని వెలువరించే నూతన సాంకేతికత
- ఓ జర్నల్ లో వివరాలు ప్రచురితం
పైకి చెప్పనప్పటికీ, ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలన్నది చైనా మనసులో మాట అని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే చైనా ఆయుధాల తయారీలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది.
తాజాగా చైనా ప్రమాదకర ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడైంది. ఇది లేజర్ ఆధారిత ఆయుధం. దీంతో, అంతరిక్షంలో తిరిగే శాటిలైట్లను సైతం ధ్వంసం చేయొచ్చు. ఈ లేజర్ ఆయుధాన్ని మరింత శక్తిమంతం చేసే మరో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చైనా రూపకల్పన చేసింది. అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతను వెలువరించే లేజర్ ఆయుధాలు త్వరగా వేడెక్కకుండా వాటిని చల్లబరిచే కొత్త టెక్నాలజీని కూడా డ్రాగన్ అభివృద్ధి చేసింది.
ఈ టెక్నాలజీ సాయంతో లేజర్ ఆయుధాలు ఎంతసేపైనా ప్రయోగించే వీలుంటుంది. లేజర్ ఆయుధం వేడెక్కకుండానే అవసరమైన శక్తిని తాజా కూలింగ్ టెక్నాలజీతో అందించవచ్చు. ఈ ఆయుధం నుంచి వెలువడే లేజర్ కిరణం రోదసిలోకి సైతం దూసుకెళ్లగలదని, అడ్డొచ్చిన ఏ వస్తువునైనా బూడిదగా మార్చేస్తుందని తెలుస్తోంది. దాంతో చైనా తన ప్రత్యర్థి దేశాల ఉపగ్రహాలను దెబ్బతీసి, ఆయా దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలను కుప్పకూల్చగలదు.
దీనికి సంబంధించిన వివరాలు ఇటీవల ఓ జర్నల్ లో ప్రచురితమవడంతో ఈ లేజర్ ఆయుధం, దాని కూలింగ్ టెక్నాలజీ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే చైనా మాత్రం ఈ సరికొత్త అస్త్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయడం కానీ, ఎక్కడా దాన్ని ప్రదర్శించడం కానీ చేయలేదు.