Sajjala Ramakrishna Reddy: ఇప్పుడేమో జగన్ రూ.1 ఇస్తే చంద్రబాబు రూ.100 ఇస్తానంటున్నాడు: సజ్జల
- అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందీ చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్న సజ్జల
- జనాన్ని ముంచే రియల్టర్‌గా చంద్రబాబు మారాడని ఆరోపణ
- తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు జగన్‌ను తిడుతున్నాడని ఆగ్రహం
- నాశనం చేయడంలో చంద్రబాబుకు వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చని వ్యాఖ్య
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు చెప్పే మాటల్లో ఎప్పుడూ నిజం ఉండదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందీ చెప్పే ధైర్యం లేదని, ప్రతిపక్ష నేతను మించిన 420 మరొకరు ఉండరని అన్నారు. అమరావతి పేరుతో 3 వేల ఎకరాలను జేబులో పెట్టుకున్నారన్నారు. జనాన్ని ముంచే రియల్టర్‌గా చంద్రబాబు మారాడని ఆరోపించారు. చంద్రబాబు తన హయాంలో ప్రజాజీవితాలను చీకటిమయం చేశారన్నారు.
అధికారంలో ఉండగా ఏమీ చేయనందుకు తనును తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌ను తిడుతున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల పేరుతో ఏపీని జగన్ అప్పులపాలు చేస్తున్నాడని, రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మారుస్తాడని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడేమో జగన్ రూ.1 రూపాయి ఇస్తే, తాను రూ.100 ఇస్తానని హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో విజయవాడ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.
నాశనం చేయడంలో చంద్రబాబుకు వరల్డ్ రికార్డ్ ఇవ్వవచ్చునని ఎద్దేవా చేశారు. బ్రోకర్ల సాయంతో చంద్రబాబు కృష్ణా జిల్లాను తాకట్టు పెట్టాడన్నారు. జనానికి జ్ఞాపకశక్తి ఉండదని చంద్రబాబుకు అపారనమ్మకమని ఎద్దేవా చేశారు. తన దత్త కొడుకు, సొంత కొడుకు ఇక్కడకు దగ్గరలోనే ఉన్నారని పవన్ కల్యాణ్, లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. 2014-19 వరకు ఏం చేశారో వారిద్దరూ చెప్పడం లేదన్నారు. కానీ ఏం చేస్తామో ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.