TTD: హిందువులందరికీ టీటీడీ పెద్దదిక్కు: టీటీడీ చైర్మన్ భూమన
- తిరుమలలో భక్తులకు సేవలు అందించడం ఉద్యోగులకు పుణ్యమని వ్యాఖ్య
- సనాతన హిందూధర్మాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు కృషి చేస్తామన్న భూమన
- టీటీడీ ఉద్యోగులకు త్వరలో ఇళ్లస్థలాలు అందిస్తామని వెల్లడి
శ్రీమహావిష్ణువు స్వయంభువుగా వెలసిన తిరుమల ప్రదేశంలో భక్తులకు సేవలు అందించడం ఉద్యోగుల జన్మజన్మల పుణ్యఫలమని, హిందూధర్మాన్ని పాటించే హిందువులందరికీ టీటీడీ పెద్దదిక్కుగా నిలుస్తోందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... సనాతన హిందూధర్మాన్ని మరింతగా విశ్వవ్యాపితం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
టీటీడీ ఉద్యోగులకు త్వరలో ఇళ్ల స్థలాలు అందిస్తామని, ఉద్యోగులు అంతర్గత ఇబ్బందులు విడనాడి ఏకంగా సహకరించాలని కోరారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం మంజూరు చేసిన 310 ఎకరాల భూమిని ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటిస్థలాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అవసరమైతే మరో 100 ఎకరాలైనా ప్రభుత్వం నుండి సేకరించి అందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు.