Viral Video: నడిరోడ్డులో చిరుతపై మూకుమ్మడిగా దాడిచేసి హడలెత్తించిన కోతులు.. ట్రాఫిక్ జామ్.. షాకింగ్ వీడియో ఇదిగో!
- దక్షిణాఫ్రికాలో ఘటన
- కోతుల చేతికి చిక్కి చావుదెబ్బలు తిన్న పులి
- ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు పెట్టిన చిరుత
బలవంతుడ నాకేమని.. పలువురితో నిగ్రహించి పలుకుట మేలా.. బలవంతమైన సర్పము.. చలిచీమలచేత చిక్కిచావదె సుమతీ!.. చాలామందికి తెలిసిన పద్యం ఇది. అలా జరుగుతుందని అనుకోవడమే తప్ప అలా జరిగ్గా చూసిన సందర్భాలు చాలా అరుదు. కానీ, మీరీ వీడియో చూస్తే అది నిజమేనని నమ్మక తప్పదు. అత్యంత బలమైన చిరుత కోతుల గుంపుకు చిక్కి గాయపడి ఎలాగోలా వాటి బారి నుంచి తప్పించుకుని ప్రాణాలు రక్షించుకునేందుకు వాయువేగంతో అడవిలోకి పరుగులు తీసింది. అయినప్పటికీ వదలని కోతులు దాని వెంటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
దక్షిణాఫ్రికాని ఓ మారుమూల ప్రాంతంలో దాదాపు 50 బబూన్లు (కోతులు) నడిరోడ్డుపై తిష్టవేసి హల్చల్ చేశాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో ఓ చిరుత అటువైపుగా దర్జాగా నడుచుకుంటూ వచ్చింది. నిజానికి చిరుతను చూసి కోతులు పారిపోవాలి. కానీ అవి మందగా ఉండడంతో ఏమాత్రం బెదరలేదు. చిరుత తమ సమీపానికి రాగానే అన్నీ కలిసి దానిపై మూకుమ్మడిగా దాడిచేశాయి. దీంతో కిందపడి విలవిల్లాడిన చిరుత తప్పించుకునేందు నానా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కోతులన్నీ దానిపై పడి విచక్షణ రహితంగా దాడిచేస్తూ గాయపరిచాయి.
అలా వాటి చేతికి చిక్కి బలహీనురాలైన చిరుత హడలిపోయింది. ప్రాణభయంతో భీతిల్లింది. వీటి ఫైట్‌తో అటుఇటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు దీనిని షూట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. చివరికి వాటి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న చిరుత వాయువేగంతో రోడ్డుదాటి అడవిలోకి పరుగులు తీసింది. అయినప్పటికీ వదలని కోతులు దాని వెనకపడ్డాయి. లేటెస్ట్ సైటింగ్స్ అనే యూట్యూబ్ చానల్లో పోస్టు చేసిన ఈ వీడియోకు 15 గంటల్లోనే ఏకంగా 1.67 లక్షల వ్యూస్ వచ్చాయి. కామెంట్లకైతే కొదవే లేదు.