Jacqueline Fernandez: ఈడీ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట

Jacqueline Fernandez allowed to travel abroad without prior court nod

  • కోర్టు ముందస్తు అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
  • సుఖేష్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి
  • ఈ కేసులో గతేడాది నుంచి బెయిల్‌ పై ఉన్న జాక్వెలిన్

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేకుండానే తన పని నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఈ కేసులో పాటియాలా హౌస్ కోర్టు ఆమె బెయిల్ షరతులను సవరించాలని నిర్ణయించింది. విదేశాలకు ప్రయాణం అవ్వడానికి మూడు రోజుల ముందు కోర్టు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలియజేయాలని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్  గత ఏడాది నవంబర్‌లో బెయిల్ పొందారు. అయితే కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే షరతుతో అప్పుడు బెయిల్‌ ఇచ్చింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పర్యటనకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని ఆదేశించింది. అందులో ఆమె వెళ్లే దేశం, బస చేసే ప్రదేశం, సంప్రదింపు నంబర్ వంటి ఇతర వివరాలు కూడా ముందుగానే కోర్టుకు సమర్పించాలని తీర్పునిచ్చింది. అయితే, తాను నటిని కావడంతో షూటింగ్ నిమిత్తం తరచూ విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని జాక్వెలిన్ కోర్టుకు విన్నవించింది. కొన్నిసార్లు తక్కువ సమయంలోనే విదేశాలకు వెళ్లేందుకు ఒప్పుకోవాల్సి వస్తోందని, లేదంటే వృత్తిపరమైన అవకాశాలను కోల్పోతానని తెలియజేసింది. వీటిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు గతంలో ఇచ్చిన మినహాయింపులను జాక్వెలిన్ దుర్వినియోగం చేయలేదని గుర్తించిన న్యాయస్థానం ఆమెకు సడలింపులు ఇచ్చింది.

  • Loading...

More Telugu News