Thammareddy Bharadwaja: చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే మంచిది: తమ్మారెడ్డి భరద్వాజ
- నేచురల్ సినిమాలు చేయడం మంచిదని వ్యాఖ్యానించిన తమ్మారెడ్డి
- చిరంజీవికి చెప్పాలనుకున్నప్పటికీ ఎందుకో చెప్పలేదని వెల్లడి
- దంగల్ వంటి నేచురల్ సినిమాలో నటిస్తే మళ్లీ చూస్తారన్న దర్శకుడు
భోళాశంకర్, లూసీఫర్ వంటి రీమేక్ చిత్రాలతో చిరంజీవి నిరుత్సాహపడటం కంటే నేచురల్ సినిమాలు చేయడం మంచిదని ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తన ఈ అభిప్రాయాన్ని చిరంజీవితో చెప్పాలని భావించానని, కానీ సాధ్యం కాలేదన్నారు. ధైర్యం చాలకనో లేక తమ చర్చ మరో అంశంపైకి మళ్లడం వల్లనో చెప్పలేకపోయానన్నారు. తాజాగా తమ్మారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్లో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. సహజత్వంతో కూడిన సినిమాలు చేయడం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారన్నారు. ఒకప్పుడు చిరంజీవి అందరి కుటుంబంలో వ్యక్తిగా కనిపించేవారని, ఆ చిరంజీవి కనిపిస్తే మళ్లీ ఆ సినిమాలు ఆడతాయన్నారు. దంగల్ వంటి నేచురల్ ఫిల్మ్‌లో చిరంజీవి నటించినా ప్రేక్షకులు చూస్తారన్నారు.
అప్పట్లో సినిమాల్లోకి వచ్చిన వారికి పని తప్ప మరో ఆలోచన లేకుండేదని, ఇప్పటికీ సినిమాపై ప్రేమ ఉన్నవాళ్లు ఉన్నప్పటికీ, చాలామంది వ్యాపారంగా చూస్తున్నారన్నారు. ఒకప్పుడు రచయితలు సూటిగా కథలు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం ఓపెన్ చేస్తే... టాప్ యాంగిల్ షాట్ అంటూ ఎలివేషన్లు ఇస్తున్నారన్నారు. ఇందుకు దర్శకులే రచయితలు కావడమూ కారణమన్నారు. ప్రేక్షకులకు ఉపయోగపడే ఏదో ఒక అంశం సినిమా కథలో ఉండాలని, అదీ సహజంగా ఉండాలని చెప్పారు. దానిని పక్కన పెట్టి ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని అంటే సినిమాలు ఆడటం లేదన్నారు. ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు అందరూ తమ కెరీర్ ప్రారంభంలో మెథడ్ యాక్టింగ్ చేసినట్లుగా ఉంటుందన్నారు.