Hyderabad District: రోడ్డు ప్రమాదంలో శాశ్వత వైకల్యం..భార్యతో విడాకులు.. బాధితుడికి రూ.1.5 కోట్ల పరిహారం
- 2017లో హైదరాబాద్‌లో ఘటన
- పెళ్లయిన కొన్ని నెలలకే రోడ్డు ప్రమాదంలో టిప్పర్ ఢీకొని యువకుడికి శాశ్వత వైకల్యం
- ఉపాధి కోల్పోవడంతో జీవితం తలకిందులు, విడాకులిచ్చేసిన భార్య
- బాధితుడికి రూ.2 కోట్ల పరిహారం ఇప్పించాలంటూ టిప్పర్ డ్రైవర్, యజమాని ఇన్సూరెన్స్ సంస్థలపై కేసు
- సిటీ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో రాజీ మార్గంలో ఇన్సూరెన్స్ సంస్థతో బాధితుడి తండ్రి చర్చలు
- చర్చలు ఫలించడంతో రూ.1.5 కోట్ల పరిహారం ఇచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ
రోడ్డు ప్రమాదంలో అన్నీ కోల్పోయిన ఓ యువకుడికి కోర్టు చొరవతో సాంత్వన చేకూరింది. శాశ్వతంగా మంచానికే పరిమితమైన అతడికి రూ.1.5 కోట్ల పరిహారం దక్కింది. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాచిగూడకు చెందిన ఉదయ్(33) గతంలో ఓ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేసేవాడు. నెలకు రూ.56 వేల జీతంతో జీవితం సాఫీగా సాగిపోయేది. ఆ తరువాత వివాహమైన కొన్ని నెలలకే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతడి జీవితం తలకిందులైంది.
2017 జనవరి 31న మోటార్‌సైకిల్‌పై నానక్ రామ్ గూడకు వెళుతుండగా అతడిని అదుపుకోల్పోయిన ఓ టిప్పర్ వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి మెదడుకు బలమైన గాయాలు కావడంతో శాశ్వత అంగవైకల్యం సంభవించి మంచానికే పరిమితమయ్యాడు. ఉపాధి కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. చివరకు భార్య కూడా విడాకులు ఇచ్చేసింది.
దీంతో, బాధితుడి తండ్రి లక్ష్మీగురవయ్య కోర్టును ఆశ్రయించారు. అన్యాయమైపోయిన తన కుమారుడికి పరిహారం ఇప్పించాలంటూ అదే ఏడాది జూన్ 28న హైదరాబాద్ పురానీహవేలీలోని సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. టిప్పర్ డ్రైవర్, యజమాని, మాగ్మా హెచ్‌డీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని బాధ్యులుగా చేస్తూ రూ.2 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు. ఆ తరువాత ఈ కేసు ప్రీ లోక్ అదాలత్ బెంచ్‌కు బదిలీ అయ్యింది.
అయితే, ఈ వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించేందుకు సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ చొరవ చూపింది. సిటీ సివిల్ కోర్టు జడ్జి రేణుక యారా సమక్షంలో ఇన్సూరెన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కరణ్ పురోహిత్, లక్ష్మీ గురవయ్య మధ్య చర్చలు జరిగాయి. చివరకు రూ.1.50 కోట్లు ఇచ్చేందుకు బీమా సంస్థ అంగీకరించడంతో బుధవారం తండ్రికి చెక్కును అందజేశారు. కోర్టులో పెండింగ్ కేసుల సమస్యకు ఆర్బిట్రేషన్‌తో చక్కని పరిష్కారం లభిస్తుందని సుప్రీం కోర్టు గతంలో అనేక మార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.