Upendra: ఎఫ్ఐఆర్‌లు రద్దు చేయండి.. హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ఉపేంద్ర
- ఫేస్‌బుక్ లైవ్‌లో దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉపేంద్ర
- వివిధ పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదు
- ఉపేంద్రకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు
అరెస్టు భయంతో అజ్ఞాతంలో ఉన్న కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసి అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ‘ప్రజాకీయ’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన ఉపేంద్ర ఆరేళ్లు అయిన సందర్భంగా ఇటీవల ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడారు. ఊరన్న తర్వాత మంచి, చెడు కూడా ఉంటాయని, మంచికే పెద్దపీట వేసి చెడును తొలగించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ కన్నడ సామెతను ఉటంకించారు. ఇది వివాదానికి కారణమైంది.
దళిత సంఘాల నేతలు ఆయనపై కేసులు పెట్టారు. దీంతో అరెస్టు భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు, బెంగళూరు, రామనగర జిల్లాల్లోని దళిత సంఘాలు ఉపేంద్రకు వ్యతిరేకంగా నిన్న కూడా ఆందోళనలు కొనసాగించారు. ఆందోళనల నేపథ్యంలో సదాశివనగర, కత్రిగుపెట్టలో ఉపేంద్ర నివాసాలకు పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు, ఉపేంద్రపై ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని సామాజిక కార్యకర్త నవీన్‌గౌడ చలనచిత్ర వాణిజ్య మండలిని డిమాండ్ చేశారు. ఉపేంద్ర పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.