Vistara Airlines: ఒంటిపై హాట్ చాక్లెట్ పడి బాలికకు గాయాలు.. విస్తారా ఎయిర్ లైన్స్‌లో ఘటన
- ఆగస్టు 11న న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళుతున్న విమానంలో ఘటన
- బాలిక అల్లరి కారణంగా వేడివేడి చాక్లెట్ ఆమె ఒంటిపై పడిందన్న ఎయిర్‌లైన్స్
- ఎయిర్‌లైన్స్ ప్రామాణిక పద్ధతుల ప్రకారం బాలికకు ప్రాథమిక చికిత్స అందించామన్న సంస్థ
- విమానం ల్యాండవగానే అంబులెన్స్ ఏర్పాటు చేసి చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడి
- ఆసుపత్రి ఖర్చులను బాధిత కుటుంబానికి తిరిగి చెల్లిస్తామని స్పష్టీకరణ
గతవారం తమ విమానంలో ప్రయాణిస్తున్న ఓ పదేళ్ల బాలిక ఒంటిపై హాట్ చాక్లెట్ పడి గాయాలయ్యాయని విస్తారా ఎయిర్‌లైన్స్ బుధవారం ప్రకటించింది. బాలిక చికిత్సకు సంబంధించిన ఖర్చంతా తామే తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. ఆగస్టు 11న ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు (జర్మనీ) బయలుదేరిన యూకే25 విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది.
‘‘బాలిక తల్లిదండ్రుల కోరిక మేరకు మా సిబ్బంది చిన్నారికి హాట్ చాక్లెట్ సర్వ్ చేశారు. ఆ సమయంలో చిన్నారి అల్లరి చేస్తుండడం వల్ల వేడివేడి హాట్ చాక్లెట్ బాలిక ఒంటిపై ప్రమాదవశాత్తూ ఒలికింది. ఎయిర్‌లైన్స్ ప్రామాణిక పద్ధతులను అనుసరించి మా సిబ్బంది బాలిక గాయానికి ప్రాథమిక చికిత్స చేశారు. ఈ క్రమంలో, విమానంలోని పారామెడికల్ సిబ్బంది సాయం కూడా తీసుకున్నారు’’ అని విస్తారా ఓ ప్రకటనలో తెలిపింది. విమానం ల్యాండవగానే బాలిక కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించింది.
అయితే, ఎయిర్‌హోస్టస్ తప్పిదం కారణంగా బాలికకు సెకెండ్ డిగ్రీ గాయమైనట్టు సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ఘటనలో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని రచనా గుప్తా అనే మహిళ సోషల్ మీడియాలో ఆరోపించింది. అయితే, ఘటన తరువాత బాధిత కస్టమర్‌తో తమ సిబ్బంది టచ్‌లోనే ఉన్నారని ‘విస్తారా’ తన ప్రకటనలో పేర్కొంది.