Andhra Pradesh: ఏపీలో కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల గోడ.. తప్పిన ప్రమాదం

Govt School building wall collapsed in Husenapuram village of Nandyala district

  • మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రమాదం
  • శిథిలావస్థకు చేరుకున్న భవనంలోనే తరగతుల నిర్వహణ
  • మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
  • అయినా పనులు మొదలు పెట్టలేదని మండిపడుతున్న గ్రామస్థులు

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వ పాఠశాల తరగతి గది గోడ కుప్పకూలింది. ఇటీవలి వర్షాలకు బాగా నానిన గోడ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. జిల్లాలోని బనగానపల్లె మండలం హుసేనాపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. 

పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల దుస్థితిని గుర్తించిన ప్రభుత్వం గతంలోనే నిధులు కూడా మంజూరు చేసింది. మరమ్మతుల కోసం నాడు నేడు పథకం కింద రూ.12.5 లక్షలు కేటాయించింది. అయినప్పటికీ ఇంకా పనులు మొదలు కాలేదని గ్రామస్థులు ఆరోపించారు.

ఈ పాఠశాలలో మొత్తం 38 మంది పిల్లలు చదువుకుంటుండగా.. బుధవారం 28 మంది స్కూలుకు వచ్చారు. మధ్యాహ్నం భోజన సమయంలో వారంతా బయటకు వెళ్లారు. అదే సమయంలో పెద్ద శబ్దంతో తరగతి గది గోడ కూలింది. తరగతి గదిలోని పిల్లల బ్యాగులపై ఇటుకలు పడి బీభత్సంగా మారింది. కాగా, ఈ ప్రమాదంపై గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News