Andhra Pradesh: గంగవరం పోర్ట్ బంద్ ఉద్రిక్తం.. పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట
- కనీస వేతనం రూ.36 వేలు చేయాలని పట్టుబట్టిన కార్మికులు
- తొలగించిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్
- గేటుకు ఇరువైపులా భారీ ఇనుప కంచె వేసి అడ్డుకున్న పోలీసులు
వేతనాలు పెంచాలంటూ విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్ట్ ముందు ఆందోళన చేస్తున్న కార్మికులు గురువారం పోర్ట్ బంద్ కు పిలుపునిచ్చారు. 45 రోజులుగా దీక్షలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోర్ట్ బంద్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు, నిర్వాసితులు, అఖిల పక్ష నేతలు ఉదయం పోర్టు వద్దకు చేరుకున్నారు. కార్మికుల బంద్ పిలుపుతో పోర్టు ముందు పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. గేటుకు ఇరువైపులా భారీ ఇనుప కంచె వేసి కార్మికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అయితే, పెద్ద సంఖ్యలో వచ్చిన కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు కార్మికులతో పాటు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.