kunamneni sambasivarao: పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో పోటీ చేస్తాం: సీపీఐ నేత కూనంనేని
- సింగరేణి కార్మిక సమాఖ్య సమావేశంలో కూనంనేని వ్యాఖ్యలు
- సీపీఐ బరిలోకి దిగుతుందని స్పష్టం చేసిన రాష్ట్ర కార్యదర్శి
- బీఆర్ఎస్, కమ్యూనిస్ట్‌ల పొత్తుపై అంచనాల నేపథ్యంలో వ్యాఖ్యలు
మునుగోడు ఉపఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, కమ్యూనిస్ట్‌లు కలిసి వెళ్తారనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మిక సమాఖ్య సమావేశంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పొత్తు ఉన్నా లేకపోయినా కొత్తగూడెంలో సీపీఐ బరిలోకి దిగుతుందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్లు చెప్పారు.
పొత్తులో భాగంగా కొత్తగూడెం, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాల సీట్లను సీపీఐ అడుగుతోంది. మరోవైపు ఇక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తాము పోటీలో ఉంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూనంనేని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కూనంనేని 2009లో కొత్తగూడెం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018లో ఓడిపోయారు.