Leopard: శ్రీ సత్యసాయి జిల్లాలో వరుసగా రెండో రోజు మరో చిరుత మృతి
- మడకశిర మండలం మెళవాయి వద్ద నిన్న ఓ చిరుత మృతి
- ఇవాళ కూడా అదే ప్రదేశంలో మరో చిరుత కళేబరం లభ్యం
- చిరుత మృతదేహం వద్ద చచ్చి పడి ఉన్న ఓ మేక
- పోస్టుమార్టం కోసం చిరుత కళేబరాన్ని ఆసుపత్రికి తరలించిన అధికారులు
ఓవైపు తిరుమల శేషాచల అడవుల్లో శ్రీవారి భక్తులను చిరుతపులులు హడలెత్తిస్తుండగా, సమీపంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతలు వరుసగా మృత్యువాత పడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
మడకశిర మండలం మెళవాయి సమీపంలో నిన్న ఓ చిరుత కళేబరం కనిపించగా, ఇవాళ మరో చిరుత మృతదేహం కనిపించడం కలకలం రేపింది. వరుసగా రెండు రోజుల్లో రెండు చిరుతలు ఒకే ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం.
స్థానికులు అందించిన సమాచారంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇవాళ చిరుత మృతదేహం వద్ద ఓ మేక కూడా చచ్చిపడి ఉండడాన్ని అధికారులు గుర్తించారు.
చిరుత శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో, మేకను తినడం వల్ల మరణించిందా? లేక అనారోగ్యంతో చనిపోయిందా? అనేది పోస్టుమార్టంలో వెల్లడవుతుందని అధికారులు చెబుతున్నారు.