Vijayasai Reddy: చంద్రబాబు రాజకీయ భవిష్యత్తును చెప్పిన విజయసాయిరెడ్డి
- వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 51 శాతానికి మించి ఓట్లు వస్తాయని జోస్యం
- టీడీపీ గుర్తును రద్దు చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్
- తెలుగుదేశం అసాంఘిక శక్తుల పార్టీ అని విమర్శ
- చంద్రబాబు తనకు తాను సింహం అనుకుంటున్నాడని ఎద్దేవా
- ఆయన అసత్య హరిశ్చంద్రుడని వ్యాఖ్య
వివిధ సర్వేల్లో వైసీపీకి 51 శాతానికి మించి ప్రజాదరణ ఉందని, ప్రతిపక్ష పార్టీలకు అన్నింటికి కలిపి 40 శాతం కూడా లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
'నాలుగేళ్లుగా జాతీయ మీడియా సంస్థలు పలు దఫాలుగా నిర్వహించిన సర్వేల్లో వైస్సార్సీపీకి 51% మించిన ప్రజాదరణ ఉంది. ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కలిపినా 40% దాటలేదు. పంచాయతీ, స్థానిక సంస్థల ఫలితాలైతే మర్చిపోలేనివి. అయినా దింపుడు కల్లం ఆశలతో బాబుగారు ఏవేవో మాయలు, కుట్రలు చేస్తూనే ఉన్నారు' అని విజయసాయి ట్వీట్ చేశారు.
చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ లేదు
విజయసాయిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తనకు తాను సింహం అనుకుంటున్నారని, ఆయన ఓ అసత్య హరిశ్చంద్రుడు అని ఎద్దేవా చేశారు. పోలీసులపై దాడి చేసిన ఘనత టీడీపీదే అన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఇప్పటి వరకు స్థిర నివాసం లేదన్నారు. కులమతాలకు అతీతంగా చంద్రబాబు ఎప్పుడూ పని చేయలేదని ఆరోపించారు. ఆయన పొత్తు పెట్టుకోని రాజకీయ పార్టీ లేదన్నారు.
వైసీపీకి 25 లోక్ సభ స్థానాలు ఖాయం
గతంలో విజన్ 2020 అన్నారని, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని, ప్రజలను మోసం చేయడానికే ఈ విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారని అన్నారు. వ్యవస్థల మీద దాడి చేసిన టీడీపీని ప్రజలు క్షమించరన్నారు. టీడీపీ అసాంఘిక శక్తుల పార్టీ అని ఆరోపించారు. టీడీపీ ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 25 లోక్ సభ స్థానాలు గెలవడం ఖాయమన్నారు. 2024 తర్వాత చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. లోకేశ్‌కు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఇప్పటి వరకు స్థిర నివాసం లేదన్నారు.