INS Vindhyagiri: భారత నేవీలో స్టెల్త్ యుద్ధనౌక... ప్రారంభోత్సవం చేసిన రాష్ట్రపతి ముర్ము
- చైనాకు చెక్ పెట్టేందుకు ప్రాజెక్ట్ 17 ఆల్ఫా చేపట్టిన భారత్
- ఇందులో భాగంగా మొత్తం 7 యుద్ధ నౌకల నిర్మాణం
- ఇప్పటివరకు ఐదు జలప్రవేశం... వింధ్యగిరి ఆరోది
ప్రాదేశిక సముద్ర జలాలపై భారత నావికాదళానికి మరింత పట్టును అందించే స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ వింధ్యగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప్రారంభించారు. ఫ్రిగేట్ వర్గానికి చెందిన ఈ యుద్ధనౌక అత్యాధునికమైనది. దీని ఆచూకీ కనిపెట్టడం శత్రువులకు అత్యంత కష్టసాధ్యమైన విషయం. దీంట్లో స్టెల్త్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు.
కోల్ కతా నగరంలోని హుబ్లీ నదీ తీరంలో ఉన్న ప్రభుత్వ రంగ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) వద్ద వింధ్యగిరి యుద్ధనౌకను లాంఛనంగా సముద్ర జలాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, ఐఎన్ఎస్ వింధ్యగిరి ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఇది భారత నావికాదళ సామర్థ్యాలను మరింత విస్తృతం చేసే ఘట్టం అని అభివర్ణించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు.
చైనా, పాకిస్థాన్ లను దృష్టిలో ఉంచుకుని... భారత్ ప్రాజెక్ట్ 17 ఆల్ఫా (పీ17ఏ) పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా 7 అత్యాధునిక నౌకలను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 5 యుద్ధ నౌకలు జలప్రవేశం చేయగా, వింధ్యగిరి ఆరోది. కర్ణాటకలో వింధ్య పర్వతాల పేరును దీనికి పెట్టారు.
ఇది పీ17ఏ శ్రేణిలోని స్టెల్త్ ఫ్రిగేట్. ఈ శ్రేణిలోని యుద్ధ నౌకల్లో శత్రు భీకర ఆయుధాలు, అత్యాధునిక సెన్సర్లు ఉంటాయి. ముఖ్యంగా, వీటిలోని గైడెడ్ మిస్సైళ్లు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి.
చైనా 355 యుద్ధ నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నావికాదళాన్ని కలిగి ఉంది. పైగా, యుద్ధనౌకల తయారీలో పాకిస్థాన్ ను కూడా ప్రోత్సహిస్తూ, సహకారం అందిస్తూ భారత్ కు సవాళ్లు విసురుతోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, భారత్ తన నేవీని భారీగా విస్తరిస్తోంది. పీ17ఏ ప్రాజెక్టు వెనుక ముఖ్య ఉద్దేశం కూడా అదే.
భారత్ కు గతంలోనూ వింధ్యగిరి పేరిట ఓ యుద్ధనౌక ఉంది. ఇది ఏఎస్ డబ్ల్యూ శ్రేణికి చెందిన ఫ్రిగేట్. పాత ఐఎన్ఎస్ వింధ్యగిరి 2012 జూన్ వరకు 31 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం సేవలు అందించింది. ఇప్పుడా పాతతరం యుద్ధ నౌక పేరునే సరికొత్త ఫ్రిగేట్ కు పెట్టారు.