Chandrababu: ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు మరో చాన్స్ ఇవ్వొద్దు: చంద్రబాబు
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- రావులపాలెంలో భారీ బహిరంగ సభ
- జగన్ మనిషా, మృగమా అంటూ నిప్పులు చెరిగిన చంద్రబాబు
- ఏపీ ప్రజలు తిరగబడాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చిన టీడీపీ అధినేత
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు మరో చాన్స్ ఇవ్వొద్దని తెలిపారు. ఏపీ భవిష్యత్ కోసం ప్రజలు తిరగబడాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్ రెడ్డి ఒక అబద్ధాల పుట్ట... సైకో పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని వివరించారు. దేశంలో ధనిక సీఎం జగనే అని వెల్లడించారు. జగన్ మనిషా, మృగమా... పేదలను నిలువునా దోపిడీ చేస్తున్నాడని విమర్శించారు. నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయని, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచారని వెల్లడించారు.
టీడీపీ అధికారంలో వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తే పరిశ్రమలు వస్తాయని అన్నారు. విజన్-2029 తయారు చేశానని, మీ బంగారు భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తున్నా అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపైనా చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక్కడ చిల్లర జగ్గిరెడ్డి తప్ప ఎవరూ ఆనందంగా ఉండే పరిస్థితులు లేవని అన్నారు.
"అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఫొటోను టిఫిన్ పేట్లలో పెట్టి అల్పాహారాలు అందించే పరిస్థితికి వచ్చారు. దళిత యువత దీన్ని ప్రశ్నించింది. అంబేద్కర్ కు అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తే... వారిపై దేశద్రోహం కేసు పెట్టారంటే ఈ జగ్గిరెడ్డిని ఏమనాలి? వీళ్లకు ఒక్క దళితుడైనా ఓటేస్తారా? ఇక్కడ ఒకాయన ఎమ్మెల్సీ ఉన్నాడు... డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేస్తాడు ఆ మహా నాయకుడు. రాజమండ్రి జైలు నుంచి ఆ నాయకుడు బయటకు వస్తే ఊరేగింపుగా తీసుకెళ్లారు.
వీళ్లకు దళితులపై ప్రేమ ఉందా? వీళ్లు దళిత ద్రోహులు కారా? దళితులకు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? దళితుల కోసం మేం 27 పథకాలు తెస్తే రద్దు చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ కూడా పోయింది" అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని, తన బాధ అంతా ఏపీ గురించి, ప్రజల గురించేనని అన్నారు. జగన్ బాబాయ్ ని చంపి ఆ కేసును తనపై మోపే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ పాలనలో అందరూ మోసపోయారని తెలిపారు. అమ్మఒడిలో కోతలు పెట్టారని ఆరోపించారు. రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చే రూ.6 వేలను కూడా లెక్కేసుకుని ఇవ్వడం ద్వారా మోసం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.