Pawan Kalyan: గంగవరం పోర్టు అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్
- పోర్టు నిర్మాణంలో రెండు మత్స్యకార గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్న జనసేనాని
- వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం
- పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా జగన్ అమ్మేశాడని విమర్శ
- ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ
గంగవరం పోర్టు అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ పోర్టు నిర్మాణంలో రెండు మత్స్యకార గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఇక్కడి వారికి కాలుష్యాన్ని కానుకగా ఇచ్చారని విమర్శించారు. కనీసం వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని, 40 రోజులకు పైగా దీక్ష చేస్తున్నప్పటికీ కార్మికుల వేదనను పట్టించుకోవడం లేదన్నారు.
పీపీపీ మోడల్లో నిర్మించిన ఈ పోర్టులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా జగన్ అమ్మేశారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న బతుకులను కూలదోసి, ఆ తర్వాత వారు రూ.15 వేలకు కార్మికులుగా మారితే వారి బతుక్కి భరోసా ఏది? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
కనీసం వేతనాలు కూడా ఇవ్వకపోతే పోరాటాలు తప్ప వారేం చేస్తారని నిలదీశారు. గంగవరం పోర్టు సమస్యను తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని అన్నారు. గంగవరం పోర్టు సమస్యకు సంబంధించి దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం చెబుదామనుకున్నానని, లేనిపోని కొత్త సమస్యలు వస్తాయని ఆగిపోయినట్లు పవన్ చెప్పారు. మత్స్యకారులకు జనసేన మద్దతు ఉంటుందన్నారు. వారికి ప్రభుత్వం, పోర్టు యాజమాన్యం తగిన న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు.