Himachal Pradesh: హిమాచల్ వరదలతో 74 మంది మృతి.. ఏకంగా రూ.10 వేల కోట్ల నష్టం
- వారం రోజులుగా హిమాచల్ లో భారీ వర్షాలు
- కొండచరియలు విరగడంతో భారీ ప్రాణ నష్టం
- పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు
భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతదేశంలోని పర్యాటక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. జులై నెలలో భారీ వరదలతో రాష్ట్రం దెబ్బతినగా మరోసారి ముంచెత్తిన వర్షాలతో రాష్ట్రంలో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో కొండ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. కొండచరియలు విరిగి పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 74 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని సిమ్లా లోని సమ్మర్ హిల్ ప్రాంతంలో సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇళ్లు, నివాస, వాణిజ్య సముదాయాలు, రహదారులు, వంతెనలు కుప్పకూలడంతో రాష్ట్రంలో 10 వేల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. రుతుపవనాలు ప్రారంభమైన 55 రోజుల్లో రాష్ట్రంలో 113 కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో, రాష్ట్ర ప్రజా పనుల శాఖ (పీడబ్లూడీ)కి రూ. 2,491 కోట్లు, జాతీయ రహదారుల సంస్థకి రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లింది. పర్యాటకుల రాక ఆగిపోవడంతో ఆ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరువైంది.