AI: ఏఐతో టెక్ ఉద్యోగాలకు గండం.. ఏటా 5 శాతం కోత
- 4-5 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న అంచనాలు
- అయినప్పటికీ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రాదన్న అంచనా
- ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు ఆటోమేషన్ తో భర్తీ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ/కృత్రిమ మేథ) కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళనలు ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. విశ్లేషకుల అభిప్రాయాలు ఈ విషయంలో భిన్నంగా ఉంటున్నాయి. ఏటా 5 శాతం పూర్తి స్థాయి టెక్నాలజీ రోల్స్ ను ఏఐ భర్తీ చేస్తుందని, వచ్చే 4-5 ఏళ్ల పాటు ఈ పరిణామం కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏఐ ఆధారిత ఆటోమేషన్ సొల్యూషన్స్ తో ప్రాథమిక స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. తక్కువ సపోర్ట్ అవసరమైన ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎక్కువ ఏర్పాటవుతాయని అంచనా వేస్తున్నారు. సంస్థలు తమ ఏఐ విధానాన్ని రూపొందించుకునే క్రమంలో ఉద్యోగ స్వరూపాలు మారిపోతాయని సర్వీస్ నౌ, యూఐ పాత్ కంపెనీలు భావిస్తున్నాయి.
చారిత్రకంగా చూస్తే కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతీ సందర్భంలోనూ అది కొత్త పనికి దారితీసినట్టు సర్వీస్ నౌ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్యాట్ కాసే తెలిపారు. ‘‘అతిపెద్ద ఐటీ ఎకో సిస్టమ్ ను గమనించినట్టయితే.. ఇంజనీరింగ్ నైపుణ్యాలకు లోటు నెలకొంది. కనుక కొన్ని రకాల ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయినప్పటికీ అది ఉద్యోగాలు కోల్పోయేందుకు దారితీస్తుందని అనుకోవద్దు. మరింత విలువను పెంచే పనికి అవకాశం ఏర్పడుతుంది’’ అని కాసే పేర్కొన్నారు.