Rahul Gandhi: మరోసారి అమేథీ బరిలో దిగనున్న రాహుల్ గాంధీ!
- 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన రాహుల్ గాంధీ
- వాయనాడ్ లో గెలిచి, అమేథీలో ఓడిపోయిన వైనం
- రాహుల్ ను ఓడించిన స్మృతీ ఇరానీ
- ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్!
గత ఎన్నికల్లో అమేథీ, వాయనాడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచి ఊరట పొందారు. అయితే, మరోసారి అమేథీలో పోటీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. తమ కంచుకోట లాంటి అమేథీలో వచ్చే ఎన్నికల బరిలో దిగాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు అజయ్ రాయ్ నిర్ధారించారు.
గత ఎన్నికల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల తేడాతో రాహుల్ ను ఓడించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2004 నుంచి అమేథీని సొంతగడ్డలా భావిస్తూ, అక్కడే పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్న రాహుల్ గాంధీకి... గత ఎన్నికల్లో స్మృతీ ఇరానీ ఓటమి రుచిచూపారు. అంతకుముందు అమేథీ కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ అడ్డాగా ఉంది.
కాగా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈసారి ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రియాంక గాంధీ వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తే కాంగ్రెస్ మొత్తం ఆమె వెనుకే ఉంటుందని యూపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అజయ్ రాయ్ స్పష్టం చేశారు.