BJP: మల్కాజిగిరి నుండి పోటీ చేస్తా: బీజేపీ నేత మురళీధరరావు
- సంక్షేమ పథకాలతో కేసీఆర్ను ఎవరూ కొట్టలేరన్న బీజేపీ నేత
- యువత వ్యతిరేకంగా ఉంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయమని వ్యాఖ్య
- అధ్యక్ష పదవి మార్పుతో పార్టీకి డ్యామేజ్ అయిందనే వాదన సరికాదన్న మురళీధర రావు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. సంక్షేమ పథకాలతో కేసీఆర్ను ఎవరూ కొట్టలేరని, హామీల అమలులో తేడాతో మాత్రమే కొట్టగలమన్నారు. యువతలో అత్యధిక శాతం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. యువత వ్యతిరేకంగా ఉంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. యూత్ గేమ్ చేంజర్ అన్నారు. పార్టీ అధ్యక్ష పదవి మార్పుతో పార్టీకి డ్యామేజ్ అయిందనే వాదన సరికాదన్నారు. నేతలను కలుపుకొనిపోవడం ఇబ్బందికరమని భావించడం వల్ల అధిష్ఠానం తొలగించి ఉండవచ్చునన్నారు.
అవినీతికి పాల్పడిన వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. పాలనలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని, అందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ నుండి గెలిచినా ప్రజాప్రతినిధులు పార్టీని మారుతారన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొందన్నారు. సిద్ధరామయ్య మాదిరి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కు మాస్ లీడర్ లేరన్నారు.