Chandrababu: భక్తులు శ్రీవారిని చూడ్డానికి కాదు... పులులను చంపడానికి వెళుతున్నట్టుంది: చేతికర్రలపై చంద్రబాబు సెటైర్
- అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
- అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో భారీ బహిరంగ సభ
- శ్రీవారి భక్తులకు టీటీడీ చేతికర్రలు ఇస్తుండడంపై చంద్రబాబు వ్యంగ్యం
- కర్రలతో వైసీపీ దొంగలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు
అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమలాపురంలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు చేతికర్రలు ఇవ్వడంపై సెటైర్ వేశారు.
మనందరి ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి... తిరుమలలో పులులు ఉంటే భక్తులకు కర్రలు ఇస్తామంటున్నారు... ఇంటికో కర్ర మాదిరి మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తున్నారు... అని వ్యాఖ్యానించారు. భక్తులు కర్రలు పట్టుకుని శ్రీవారిని చూడ్డానికి కాదు... తిరుమలలో పులులను చంపడానికి వెళుతున్నట్టుంది అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
చేతిలో కర్ర ఉంటే పులి పారిపోతుందంట అంటూ ఎద్దేవా చేశారు. ఇది సరైన నిర్ణయమేనా... సమర్థ ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని ఈ వైసీపీ దొంగలను తరిమికొట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పరిపాలన అంటే దోచుకోవడం కాదు... సేవ చేయడమే పరిపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడమే పరిపాలన అని స్పష్టం చేశారు.