Team India: చివర్లో మెకార్తీ బాదుడు... టీమిండియా టార్గెట్ 140 రన్స్
- డబ్లిన్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసిన ఐర్లాండ్
- అర్ధసెంచరీతో అలరించిన బ్యారీ మెకార్తీ
- ఓ దశలో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్
- 4 ఫోర్లు, 4 సిక్సర్లతో మెకార్తీ దూకుడు
జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని టీమిండియా బౌలర్లు తొలి టీ20లో ఐర్లాండ్ ను కట్టడి చేశారు. డబ్లిన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది.
ఓ దశలో 59 పరుగలకే 6 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరు చేసిందంటే అందుకు కారణం బ్యారీ మెకార్తీనే. మెకార్తీ 33 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సులతో 51 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి మెకార్తీ సిక్స్ బాది అర్ధసెంచరీ మార్కు అందుకున్నాడు.
మార్క్ అడైర్ 16 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో కర్టిస్ కాంఫర్ 39 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, రవి బిష్ణోయ్ 2, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే బుమ్రా... ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఐర్లాండ్ ను దెబ్బతీయగా, మిడిల్ ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ విజృంభించారు. అయితే ఐర్లాండ్ పై అదే ఒత్తిడిని కొనసాగించడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. దాంతో ఐర్లాండ్ స్కోరు 100 దాటింది.