Team India: వరుణుడు అడ్డొచ్చినా విజయం టీమిండియాదే!
- టీమిండియా, ఐర్లాండ్ మధ్య తొలి టీ20
- డీఎల్ఎస్ ప్రకారం 2 పరుగులతో నెగ్గిన టీమిండియా
- తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు
- టీమిండియా లక్ష్యఛేదనలో 6.5 ఓవర్ల వద్ద వర్షం
- అప్పటికి 2 వికెట్లకు 47 పరుగులు చేసిన బుమ్రా సేన
ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా, డక్ వర్త్ లూయిస్ విధానం (డీఎల్ఎస్) ప్రకారం టీమిండియా 2 పరుగుల తేడాతో గెలిచింది.
వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ స్కోరు 6.5 ఓవర్లలో 2 వికెట్లకు 47 పరుగులు. డీఎల్ఎస్ ప్రకారం అప్పటికి 45 పరుగులు చేస్తే సరిపోతుంది. వర్షం పడే సమయానికి టీమిండియా 2 పరుగులు ముందే ఉంది. ఇక ఎంతకీ వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో డీఎల్ఎస్ ప్రకారం భారత్ ను విజేతగా ప్రకటించారు.
డబ్లిన్ లోని 'ద విలేజ్' మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది.
కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 20న ఇదే మైదానంలో జరగనుంది.