Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు..శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం
- డిస్కో శాంతి తాజాగా ఇంటర్వ్యూలో భావోద్వేగం
- శ్రీహరి మరణం తరువాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని వెల్లడి
- అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన
- కొందరి మోసం కారణంగా డబ్బు కోల్పోవాల్సి వచ్చిందన్న డిస్కో శాంతి
- రెండు ఇళ్లపై వచ్చే అద్దె, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీతో బతుకుబండి నడిపిస్తున్నామన్న నటి
అట్టడుగు స్థాయి నుంచి తన ప్రయాణం ప్రారంభించిన నటుడు శ్రీహరి సినీ ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు. తొలుత విలన్గా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటన, కామెడీ టైమింగ్తో అభిమానులను విశేషంగా అలరించారు. 2013లో నటుడు ప్రభు దేవాకు సంబంధించిన ఓ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన ఆయన అక్కడ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. ఆ తరువాత లీలావతీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు.
శ్రీహరి భార్య డిస్కో శాంతి తన భర్త మరణంపై గతంలో అనేక మార్లు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రిపై కేసు వేయాలని కొందరు సలహాలు ఇచ్చినప్పటికీ పిల్లలతో తాను కోర్టుల చుట్టూ తిరగలేనని భావించి వెనకడుగు వేసినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీహరి మరణం తరువాత తమ ఆర్థిక స్థితి తలకిందులైందని, తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
శ్రీహరి మరణం తరువాత తమను ఒక్కసారిగా అనేక సమస్యలు చుట్టుముట్టాయని నాటి పరిస్థితులను డిస్కో శాంతి గుర్తుచేసుకున్నారు. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న తాను కొందరి మోసం కారణంగా డబ్బు కూడా నష్టపోయానని తెలిపారు. ఆ డబ్బే ఉండి ఉంటే తన కుమారుడు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లి ఉండేవాడని అన్నారు. తమ డబ్బు తిరిగిరాలేదు కానీ అప్పులిచ్చిన వాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పారు. అప్పులు తీర్చేందుకు తమ వద్ద ఉన్న కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేయాల్సి వచ్చిందని వాపోయారు.
ఎంతో ఇష్టంగా కొనుక్కుకున్న కారు కూడా ఈఎమ్ఐలు కట్టలేక వదులుకోవాల్సి వచ్చిందని డిస్కో శాంతి అన్నారు. శ్రీహరి కట్టిన తాళి తప్ప సర్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రెండు ఇళ్లపై వస్తున్న అద్దెతోనే జీవితం నెట్టుకొస్తున్నామని చెప్పారు. రోడ్డు విస్తరణలో తమ జాగాలో కొంత భాగం కోల్పోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని బ్యాంకులో వేశామని, దానిపైనా కొంత ఆదాయం వస్తోందని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఏమైనా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని ఆమె పేర్కొన్నారు.