USA: బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన.. అమెరికాలో 10 ఏళ్ల బాలుడి అరెస్ట్, విడుదల!
- మిసిసిప్పీ రాష్ట్రంలో ఆగస్టు 10న ఘటన
- తల్లి కారు వెనకాల బాలుడు మూత్ర విసర్జన చేయడం చూసి అరెస్ట్ చేసిన పోలీసులు
- పరిసర ప్రాంతాల్లో వాష్‌రూంలు లేవని తల్లి చెప్పడంతో ఇలా చేశానని బాలుడి వెల్లడి
- పోలీసుల చర్యపై తల్లి అగ్గిమీద గుగ్గిలం
- బాలుడు చెప్పింది నిజమో కాదో తనను అడిగి తెలుసుకుని ఉండాల్సిందని ఆగ్రహం
- పోలీసులు చిన్నారిని కాసేపటికే తల్లికి అప్పగించినట్టు మీడియాలో వార్తలు
అమెరికాలో బహిరంగ మూత్ర విసర్జన చేసిన ఓ 10 ఏళ్ల బాలుడి అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. పోలీసులు ఇలా చేస్తారని తాను అస్సలు ఊహించలేదని బాలుడి తల్లి మండిపడింది. మిసిసిపీ రాష్ట్రంలో ఆగస్టు 10న ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, స్థానిక మహిళ లటోన్యా ఈటర్ ఇటీవల తన లాయర్‌తో మాట్లాడేందుకు తన పిల్లలతో కలిసి వెళ్లింది. కారు బయట పార్కు చేసి మహిళ లోపలకు వెళ్లింది. ఈలోపు బాలుడు తల్లి కారు వెనుక మూత్ర విసర్జన చేయడం గమనించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై బాలుడి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అక్కడ చుట్టుపక్కల బాత్రూంలు లేవని నేను, నా కూతురు చెప్పామని నా కొడుకు పోలీసులకు చెప్పాడట. పోలీసులు ఈ విషయాన్ని చెప్పగానే ఆశ్చర్యపోయా. తెలిసీ తెలీక వాడు ఏదో చెప్పాడని అరెస్టు చేస్తారా? నా కొడుకు చెప్పింది కరెక్టో కాదో నిర్ధారించుకునేందుకు నన్ను వారు సంప్రదించి ఉండాల్సింది. అతడు చేసింది తప్పే కానీ, అరెస్టు చేయడం మాత్రం సరికాదు. ఇది పసిమనసుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీని ప్రతికూల ఫలితం అతడు పెద్దయ్యాక కూడా ఉండొచ్చు’’ అని మహిళ వాపోయింది.
పోలీసులను చూశాక తనకు ఏం జరుగుతోందో అర్థం కాలేదని బాలుడు చెప్పాడు. ‘‘ఆ తరువాత కారులో కూర్చున్న నన్ను వాళ్లు కిందకు దించారు. అప్పుడు ఏం జరగబోతోందో నాకు అర్థం కాలేదు. జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని వణికిపోయాను’’ అని ఆ చిన్నారి మీడియాకు తెలిపాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, చిన్నారిని అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు అతడిని మళ్లీ తల్లికి అప్పగించారట.