Anantapur District: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీటి పథకం కార్మికుల సమ్మె.. 850 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా
- జిల్లాలోని శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం కార్మికుల సమ్మె
- అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులు
- ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మెకు దిగారు. తాగునీటిని సరఫరా చేసే పంపులను బంద్ చేశారు. దీంతో హిందూపురం, మడకశిర, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా, ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు నీటి సరఫరా నిలిచిపోవడంతో 850 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.