Sourav Ganguly: జాదవ్ పూర్ వర్సిటీలో విద్యార్థి మరణంపై గంగూలీ ఆవేదన
- ఆగస్టు 9న ఘటన
- వర్సిటీలో బాల్కనీ నుంచి పడి ఓ విద్యార్థి మృతి
- విద్యార్థి మృతికి ముందు ర్యాగింగ్ కు గురైనట్టు ఆరోపణలు ఉన్నాయన్న గంగూలీ
- వర్సిటీల్లో కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ
పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందిన ఘటన ర్యాగింగ్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ఘటనపై భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆవేదన వ్యక్తం చేశారు.
జాదవ్ పూర్ వర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మృతి ఘటన కలచివేసిందని తెలిపారు. ఆ విద్యార్థి చనిపోవడానికి ముందు ర్యాగింగ్ కు గురైనట్టు ఆరోపణలు వచ్చాయని వెల్లడించారు. విద్యార్థులు వర్సిటీలకు వచ్చేది చదువుకోవడానికని, అలాంటి చోట విద్యార్థులు ర్యాగింగ్ కు గురికావడం అవమానకరం అని గంగూలీ పేర్కొన్నారు. ర్యాగింగ్ భూతాన్ని కట్టడి చేయడానికి యూనివర్సిటీల్లో కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.