Jagga Reddy: కాంగ్రెస్‌లో నేను ఉండకూడదా? ఎందుకింత శాడిజం?: జగ్గారెడ్డి ఆగ్రహం
- పార్టీ మారుతున్నారంటూ ఏడాదిన్నరగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిన 10 రోజులకే ప్రచారం చేశారన్న జగ్గారెడ్డి
- అసత్య ప్రచారం చేసేవారికి ప్యాకేజీలు ఎవరిస్తున్నారని ప్రశ్న
'కాంగ్రెస్‌లో నేను ఉండకూడదని భావిస్తున్నారా? ఎన్నికలు రాగానే మళ్లీ నేను పార్టీ మారుతున్నట్లు పోస్టులు పెడుతున్నారు?' అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌లో ఉండకూడదన్నది ఎవరి వ్యూహమని ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడానికి అలా అసత్య ప్రచారం చేసేవారికి ప్యాకేజీలు ఎవరు ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఉండవద్దా? అని ఆయన ప్రశ్నించారు.
ఏడాదిన్నరగా తనపై పార్టీలో దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిన పది రోజులకే తనపై పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత శాడిజం ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. 2018లో తనను ప్రభుత్వం జైలుకు పంపించిందని, కానీ బీఆర్ఎస్‌పై కొట్లాడి గెలిచానన్నారు. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కావొద్దని తాను తన భార్యను పోటీకి దింపానని గుర్తు చేశారు. సీఎం జిల్లాలో కాంగ్రెస్ పోటీలో ఉండాలనే ఉద్ధేశ్యంతో నిలబెట్టినట్లు చెప్పారు. 230 ఓట్లు పార్టీకి రావాలంటే, అంతకంటే ఎక్కువే వచ్చాయన్నారు.