Nara Lokesh: జగన్ పతనం అక్కడి నుంచే ప్రారంభం కాబోతోంది: నారా లోకేశ్
- మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ లు
- ప్రజావేదిక, కొండవీటి ప్రాజెక్టు వద్ద సెల్ఫీలు
- ప్రజావేదిక శిథిలాలే సైకో పాలనకు సమాధి రాళ్లు అంటూ వ్యాఖ్యలు
- పేదల కన్నీరు దావానలంలా మారుతోందని వెల్లడి
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 188వ రోజు మంగళగిరి నియోజకవర్గంలో ముగిసి ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్ టౌన్ లోకి యువగళం పాదయాత్ర ప్రవేశించగా... పార్టీ నేతలు కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ వాణిజ్య విభాగం నేత డూండీ రాకేష్ నేతృత్వంలో లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ, గద్దే రామ్మోహన్ రావు, గద్దే అనూరాధ తదితరులు లోకేశ్ కు స్వాగతం పలికారు.
లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ లు...
ప్రజావేదిక శిథిలాలే సైకోపాలనకు సమాధిరాళ్లు!
జగన్ సైకోయిజానికి ప్రత్యక్షసాక్షి ఉండవల్లిలోని ప్రజావేదిక. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో 2019 జూన్ 25న మొదలైన కూల్చివేతల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 51 నెలల రాక్షస పాలనలో గూడు కోల్పోయిన లక్షలాది పేదల కన్నీరు దావానలంలా మారుతోంది.
ఏ విధ్వంసంతో నువ్వు పాలన ప్రారంభించావో అక్కడి నుంచే నీ పతనం ప్రారంభం కాబోతోంది... ఈ ప్రజావేదిక శిథిలాలే మరో 9 నెలల్లో నీ అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయి... రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డీ!
దార్శనికుడి ముందుచూపు ...కొండవీటివాగు ఎత్తిపోతల!
దార్శనికుడు చంద్రబాబునాయుడు ముందుచూపునకు నిదర్శనం కొండవీటివాగు ఎత్తిపోతల పథకం. రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.222 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.
రికార్డు సమయంలో కేవలం 18 నెలల్లో పూర్తిచేసి 2018 సెప్టెంబర్ 16న రాష్ట్రప్రజలకు అంకితం చేశారు. ఒకే రోజు ఒక టీఎంసీ నీళ్లు వచ్చినా సమర్థవంతంగా వరదను నివారించే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దివాలాకోరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేక రైతాంగాన్ని వరదల్లో ముంచెత్తుతున్నాడు.
మైనారిటీల ఆస్తులపై తప్ప... సంక్షేమంపై శ్రద్ధ ఏది జగన్?
ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని జన్నతుల్ భఖీ ఖబరస్థాన్ (శ్మశానం). గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1.33 కోట్లతో దీనిని ఏర్పాటు చేశాం. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటికల్లో సౌకర్యాలు కల్పించకపోగా వాటిని సైతం వదలకుండా వైసీపీ దొంగలు కబ్జా చేస్తున్నారు. గత నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులు కబ్జాకు గురయ్యాయి.
నర్సరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణకోసం పోరాడిన ఇబ్రహీంను నడిరోడ్డుపై నరికి చంపారు. జగన్ అండ్ కోకు మైనారిటీల ఆస్తులు, ఓట్లపై తప్ప వారి సంక్షేమంపై శ్రద్ధలేదనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?!
లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...
- వైసీపీప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన వ్యాపార ప్రముఖులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు బనాయించి జైలులో పెట్టారు.
- నంద్యాల మండీ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకటసుబ్బయ్యను కిరాతకంగా చంపిన రౌడీలు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు.
- టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గించి వ్యాపారాలను ప్రోత్సహిస్తాం.
- ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, చిరువ్యాపారులకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం. ఆర్యవైశ్యులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం.
- పేదవాడినని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదోళ్ల నోటికాడ కూడు తీసేశాడు.
- ఇంటిపన్నులు, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదవాడి బతుకును ఛిద్రంచేశారు.
- టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజలపై మోపిన అన్నిరకాల భారాలను సమీక్షించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తాం.
- అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదవాళ్ల ఆకలి తీరుస్తాం. ముఠా కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తాం.
- తమ న్యాయమైన డిమాండ్లకోసం పోరాడే ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా అణచివేత చర్యలకు పాల్పడుతోంది.
- జూనియర్ లైన్ మెన్ల సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. వారు పరిష్కరించకపోతే టీడీపీ ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తాం. పేస్కేల్స్ విషయంలో ఎలక్ట్రికల్ ఉద్యోగులకు న్యాయం చేస్తాం.
- అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. ప్రమాద బీమా, హెల్త్ ఇన్స్యూరెన్స్, ఆటో ఇన్స్యూరెన్స్ అన్నీ బోర్డు ద్వారా తక్కువ ధరకు అందిస్తాం.
- ఆటో కార్మికులకు పోలీసుల వేధింపులు లేకుండా చేస్తాం. సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం. ఆటో స్టాండ్స్ లోనే ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తాం. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను చంద్రన్న బీమా ద్వారా ఆదుకుంటాం.
- ప్రచురించిన పుస్తకాలకు డబ్బులివ్వకపోగా, తిరిగి పబ్లిషర్లను వేధించడం దుర్మార్గం. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తాం. బుక్ పబ్లిషర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం.
- జగన్మోహన్ రెడ్డి పాలనలో బ్రాహ్మణులపై కూడా వైసీపీ ముష్కరమూకలు పేట్రేగిపోతున్నాయి. ఇటీవల భీమవరంలో వైసీపీ నాయకుడు యుగంధర్ పురోహితుడిపై దాడిచేసి యజ్ఞోపవీతాన్ని తెంచేశాడు.
- టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ని మరింత బలోపేతం చేస్తాం. బ్రాహ్మణులని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తాం.
- బ్రాహ్మణ ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం నుండి సహాయంతో పాటు కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. అర్చకులకు గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం, గౌరవం ఇస్తాం. బ్రాహ్మణులకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం.
- జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భారీగా బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయడంలేదు.
- కరోనా సమయంలో ఆర్ఎంపీ, పీఎంపీలు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో సేవ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కమ్యూనిటీ పారామెడిక్స్ ను అధికారికంగా గుర్తించి వారి సేవలను గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు వినియోగించుకుంటాం.
- జగన్ ఇసుక దోపిడీ పాలసీ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. నాలుగేళ్ల విధ్వంసక పాలనలో భవన నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న ఎలక్ట్రికల్ వర్కర్లు తీవ్రంగా నష్టపోయారు.
- టీడీపీ అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును బలోపేతం చేస్తాం. కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా గుర్తింపు కార్డులిచ్చి ఈఎస్ఐ, చంద్రన్న బీమా వంటి పథకాలు వర్తింపజేస్తాం.
*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2509.8 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం 13.3 కి.మీ.*
*189వరోజు (20-8-2023) యువగళం వివరాలు*
*విజయవాడ ఈస్ట్/పెనమలూరు నియోజకవర్గాలు (ఉమ్మడి కృష్ణాజిల్లా)*
మధ్యాహ్నం
12.00 – ఏ కన్వెన్షన్ సెంటర్ క్యాంప్ సైట్ లో ఆటోనగర్ వర్కర్లతో ముఖాముఖి.
2.00 – ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
2.15 – డివి మేనర్ వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో సమావేశం.
2.35 – లలితా జ్యుయలరీ వద్ద లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
3.05 – ఎన్టీఆర్ సర్కిల్ లో మహిళలతో సమావేశం.
3.15 – పటమట సెంటర్ లో నగరాలు సామాజికవర్గీయులతో సమావేశం.
3.35 – పటమట హైస్కూలు రోడ్డులో సీనియర్ సిటిజన్లతో సమావేశం.
3.50 – ఆటోనగర్ గేటు వద్ద బీమా మిత్రులతో సమావేశం.
సాయంత్రం
4.00 – వంద అడుగుల రోడ్డువద్ద స్థానికులతో సమావేశం.
4,25 – సనత్ నగర్ వద్ద పాదయాత్ర పెనమలూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.
4.45 – తులసీనగర్ లో స్థానికులతో సమావేశం.
5.00 – కానూరులో ముస్లిం సామాజికవర్గీయులతో సమావేశం.
5.30 – కామయ్యతోపు జంక్షన్ లో స్థానికులతో సమావేశం.
5.45 – సిద్దార్థ కాలేజివద్ద స్థానికులతో మాటామంతీ.
6.30 – పోరంకి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
8.30 – నిడమానూరు సెంటర్ వద్ద పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం.
9.00 – నిడమానూరు శివారు విడిది కేంద్రంలో బస.
******