Luna-25: రష్యా వ్యోమనౌక ‘లూనా-25’లో ఎమర్జెన్సీ సమస్య.. జాబిల్లిపై ల్యాండింగ్‌‌ ప్రశ్నార్థకం!

Russian Luna 25 suffers emergency situation above Moon landing in question

  • చంద్రుడి చుట్టూ చిట్టచివరి కక్ష్యలోకి ప్రవేశపెట్టే సమయంలో లూనా-25లో ఎమర్జెన్సీ సమస్య
  • అనుకున్న ప్రకారం కక్ష్య మార్పిడి జరగలేదంటూ రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటన
  • సమస్యను తమ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని వెల్లడి

జాబిల్లిపై చంద్రయాన్-3 కంటే ముందే దిగేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ప్రయోగించిన లూనా-25 వ్యోమనౌకలో ఊహించని సమస్య తలెత్తింది. చంద్రుడి చుట్టూ చివరి కక్ష్య అయిన ప్రీలాండింగ్ ఆర్బిట్‌లోకి లూనా-25ని చేర్చేందుకు జరిగిన ప్రయత్నం అనుకున్న రీతిలో సాగలేదు. ఈ సమస్యను రష్యా శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ‘‘ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు లూనా-25ని ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌లోకి మార్చే ప్రయత్నం చేశాము. ఈ క్రమంలో లూనా-25లో ఎమర్జెన్సీ తలెత్తింది. ఫలితంగా, వ్యోమనౌకను అనుకున్న విధంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయాము’’ అని రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, తదుపరి ఏం జరగనుంది? చంద్రుడిపై లూనా-25 ల్యాండింగ్ సాధ్యపడేదేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

రష్యా నిపుణుల బృందం ఈ సమస్యను నిశితంగా అధ్యయనం చేస్తోందని కూడా రాస్‌కాస్మోస్ వెల్లడించింది. అయితే, లూన్-25ని చంద్రుడిపై ఎప్పుడు దించుతారు? చంద్రయాన్-3 కంటే ముందే ల్యాండ్ కానుందా? తదితర అంశాలపై ఎటువంటి వివరణా ఇవ్వలేదు. 

ఆగస్టు 11న తూర్పు రష్యాలోని వోస్తోఖ్నీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25 నింగికెగసిన విషయం తెలిసిందే. ఈ వారం మొదట్లో వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రుడిపై దిగాక అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అధ్యయనం చేయాలనేది ఈ మిషన్ లక్ష్యం. చంద్రుడి వాతావరణంపై అవగాహన పెంచేందుకు, ఆపై జాబిల్లి మీద ఆవాసాలు ఏర్పాటు చేసేందుకు ఈ అధ్యయనం కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతున్నారు. అక్కడి బిలాల్లో నీరు ఉందని నిపుణుల విశ్వాసం. 

ఇక అంతరిక్ష రంగంలో రష్యా ప్రాభవాన్ని పునరుద్ధరించాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నాల్లో భాగంగా లూనా-25 ప్రయోగానికి రష్యా పూనుకుంది.

  • Loading...

More Telugu News