Donald Trump: ప్రజాదరణలో దూసుకుపోతున్న ట్రంప్.. రెండో స్థానంలో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి
- రిపబ్లిక్ పార్టీ మద్దతుదారుల సపోర్టు కూడగట్టడంతో నెం.1గా ట్రంప్
- నెం.2 స్థానం కోసం వివేక్ రామస్వామి, ఫ్లోరిడా గవర్నర్ మధ్య తీవ్ర పోటీ
- 35 ఏళ్ల లోపు యువత, పట్టభద్రుల్లో వివేక్‌కు పెరుగుతున్న మద్దతు
రిపబ్లిక్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగుతున్న డోనాల్ట్ ట్రంప్ కు పార్టీలో మద్దతు భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన 56 శాతం మద్దతుతో తొలిస్థానంలో ఉన్నట్టు ఇటీవల జరిగిన ఓ సర్వేలో తెలిసింది. కాగా, రేసులో ఉత్సాహంగా పాల్గొంటున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి 10 శాతం మద్దతుతో రెండో స్థానంలో నిలిచారు. ఈ స్థానంలో కొనసాగేందుకు ఆయన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్తో పోటీ పడుతున్నారు. రాన్ డిశాంటిస్‌కు కూడా 10 శాతం మంది పార్టీ సభ్యుల మద్దతు ఉండటంతో ఇద్దరి మధ్యా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ కొనసాగుతోంది. ఎమర్జెన్ కాలేజీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కాగా, జూన్‌లో డిశాంటిస్‌కు 26 శాతం మంది మద్దతు ఇవ్వగా ప్రస్తుతం ఇది ఏకంగా 10 శాతానికి పడిపోయింది. అయితే, ఒకప్పుడు వివేక్‌కు రెండు శాతం మంది మాత్రమే సపోర్ట్ చేయగా ప్రస్తుతం వారి మద్దతు 10 శాతానికి చేరుకుంది. ఇక రాన్ డిశాంటిస్ మద్దతుదారుల్లో అనేక మంది పునరాలోచనలో పడ్డట్టు కూడా ఈ సర్వేలో తేలింది. డిశాంటిస్ సపోర్టర్లలో కేవలం మూడో వంతు మంది మాత్రమే ఆయనకు కచ్చితంగా ఓటేస్తామని పేర్కొన్నారు. కానీ, రామస్వామి ఫాలోవర్లలో ఏకంగా సగం మంది ఆయనకే తమ మద్దతని తేల్చి చెప్పారు.
పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఓటర్లు, 35 ఏళ్ల లోపు వయసున్న వారి మద్దతు కూడగట్టడంలో వివేక్ రామస్వామి మంచి పురోగతి సాధిస్తున్నట్టు ఎమర్సన్ కాలేజ్ పోలింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెన్సర్ కింబల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.