Pakistan: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం.. 18 మంది సజీవ దహనం

18 Dead In Pakistan As Bus Drives Into Truck Carrying Diesel Bursts Into Flames

  • డీజిల్ డ్రమ్ముల వ్యాన్ ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు
  • మంటల్లో చిక్కుకుని 16 మందికి తీవ్ర గాయాలు
  • మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారుల ఆందోళన

పాకిస్థాన్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వేగంగా దూసుకెళుతున్న ఓ బస్సు ముందు వెళుతున్న వ్యాన్ ను ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యాన్ లో ఉన్న డీజిల్ డ్రమ్ములు పగిలి డీజిల్ నేలపాలైంది. ఆపై మంటలు ఎగిసిపడి బస్సు, వ్యానును చుట్టుముట్టాయి. మంటల్లో చిక్కుకుని బస్సులోని ప్రయాణికులు, వ్యాన్ డ్రైవర్ సహా పద్దెనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో 16 మందికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగానే ఉందని, మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

కరాచీ నుంచి సుమారు 40 మంది ప్రయాణికులతో ఓ బస్సు శనివారం రాత్రి ఇస్లామాబాద్ కు బయలుదేరిందని పోలీసులు తెలిపారు. పిండి భట్టియాన్ సమీపంలో ముందు వెళుతున్న వ్యాన్ ను ఢీ కొట్టిందని చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. దీంతో మంటలు ఎగిసిపడగా చాలామంది ప్రయాణికులు చనిపోయారని, కొంతమంది కిటీకీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు ప్రయాణికులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ కూడా చనిపోయారని డిస్ట్రిక్ పోలీస్ ఆఫీసర్ (డీపీఓ) ఫహద్ వివరించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బస్సు అతివేగమా లేక డ్రైవర్ నిద్రమబ్బు వల్లనా.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం గుర్తించేందుకు దర్యాఫ్తు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై పంజాబ్ ప్రావిన్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ.. ప్రమాద వార్త తనను కలిచి వేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి వ్యక్తంచేశారు.

  • Loading...

More Telugu News