KCR: మోసపూరిత మాటలు నమ్మొద్దు: కేసీఆర్
- ఎన్నికలు వస్తున్న తరుణంలో కొత్త బిచ్చగాళ్లు రంగంలోకి దిగారన్న కేసీఆర్
- గత 50 ఏళ్లలో బీజేపీ, కాంగ్రెస్ చేసిందేముందని ప్రశ్న
- ఈ సారి మరో 5 - 6 సీట్లు ఎక్కువగా గెలుచుకుంటామని ధీమా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో కొందరు కొత్త బిచ్చగాళ్లు రంగంలోకి దిగారని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వారు యత్నిస్తున్నారని... వారి మోసపూరిత మాటలు వినొద్దని ప్రజలను కోరారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అంటున్నారని.. గత 50 ఏళ్లలో వాళ్లు చేసిందేముందని కేసీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వితంతువులు, సీనియర్ సిటిజన్లు, ఇతరులకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీలు ఇస్తున్నారని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 4 వేల పెన్షన్ ఇస్తున్నారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వం కూడా పింఛనును పెంచబోతోందని, త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధించబోతోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల కంటే ఈసారి మరో 5, 6 సీట్లను అధికంగా గెలుచుకుంటామని చెప్పారు. రెండు దఫాలుగా రూ. 37 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. రైతుభీమా వంటి పథకాలు దళారుల ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయని చెప్పారు. ధరణి పోర్టల్ ను రద్దు చేసి మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.