Venkaiah Naidu: కులాల కుమ్ములాటలో దూరొద్దు.. యువకులకు వెంకయ్య సూచన
- యువతే దేశానికి భవిష్యత్తు అన్న వెంకయ్య
- ఇష్టపడి, కష్టపడి చదవాలని సూచన
- ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలు కావద్దని హితవు
కులాల కుమ్ములాటలో యువకులు దూరొద్దని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. యువతే ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని అన్నారు. మాతృభాషను మరిచిపోవద్దని విద్యార్థులకు సూచించారు. సోమవారం గుంటూరులో భాష్యం విద్యాసంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన సన్మానించారు.
చదువు అనేది ర్యాంకుల కోసం కాదని, విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికని వెంకయ్య అన్నారు. ఇష్టపడి, కష్టపడి చదవాలని సూచించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలని, కొత్త విద్యా విధానంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలు కావద్దని వెంకయ్య సూచించారు. సాంకేతికత అవసరమే కానీ.. పూర్తిగా దాని మీదే ఆధారపడవద్దని చెప్పారు. చిన్న సమాచారం కోసం కూడా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారని అన్నారు.