Nara Lokesh: నిన్న సాయంత్రం 4 గంటల నుంచి వేకువ జామున 3.40 వరకు లోకేశ్ పాదయాత్ర కొనసాగింది: దేవినేని ఉమా
- నిన్న విజయవాడలో ప్రారంభమైన యువగళం
- గన్నవరం నియోజకవర్గం నిడమానూరులో ముగిసిన వైనం
- ఏకబిగిన 12 గంటల పాటు కొనసాగిన లోకేశ్ పాదయాత్ర
- ఎక్కడా విశ్రాంతి తీసుకోని టీడీపీ యువనేత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో రికార్డుల మోత మోగిస్తున్నారు. నిన్న ఆయన ఏకంగా 12 గంటల పాటు నడిచారు. ఈ విషయాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు.
నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈ తెల్లవారుజాము 3.40 గంటల వరకు లోకేశ్ పాదయాత్ర కొనసాగిందని తెలిపారు. 12 గంటల పాటు 16 కిలోమీటర్ల మేర నిర్విరామంగా లోకేశ్ నడిచారని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో యువగళం షెడ్యూల్ కంటే 8 గంటల ఆలస్యంగా సాగిందని దేవినేని ఉమా వివరించారు
కాగా, నిన్న సాయంత్రం విజయవాడలో మొదలైన పాదయాత్ర గన్నవరం నియోజకవర్గం నిడమానూరులో ముగిసింది. రాత్రి 1.15 గంటలకు పెనమలూరు నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్రకు అపూర్వ స్వాగతం లభించింది.
అంత రాత్రి వేళ సైతం జనాలు పోటెత్తడంతో లోకేశ్ అలసటను కూడా మర్చిపోయి ఉల్లాసంగా కనిపించారు. చేతివేళ్లకు గాయమైనప్పటికీ ఆయన తేలిగ్గా తీసుకున్నారు.